మూడు రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాఫిక్‌గా మారింది. మూడు రాజధానుల పై తగ్గేదే లేదని వైసీపీ అంటోంది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకు వేసింది. మూడు రాజధానుల అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర రాజధాని అమరావతే అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
రాష్ట్ర రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందం ప్రకారం 6 నెల్లలో అమరావతి అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్ లో వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్ లో పేర్కొంది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు సాధ్యం కాదని తెలిపింది.