ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేఫథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులను పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుత వేసవి సెలవులు ఈ ఏడాది జూన్ 3తో ముగుస్తున్నాయి. దీంతో జూన్ 30 వరకూ సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా వ్యాప్తి నేఫథ్యంలో పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం మరోమారు సెలవులను పొడిగించింది. జూన్ 30 తర్వాత పరిస్థితిని బట్టి సెలవులు పొడిగింపుపై నిర్ణయానికి వస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 84,232 శాంపిళ్లను పరీక్షించగా.. 13,400 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 16,85,142కి చేరింది. నిన్న 21,133 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 15,08,515కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 94 మంది మరణించగా.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,832కి చేరింది.