ఏపీ వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఈ రూల్ పాటించాల్సిందే
AP govt directs Transport dept. to ensure high security number plates to vehicles. అమరావతి: రాష్ట్రంలోని అన్ని రకాల వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండేలా
By అంజి Published on 13 Jan 2023 5:38 AM GMTఅమరావతి: రాష్ట్రంలోని అన్ని రకాల వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన రోడ్ సేఫ్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జవహర్‌రెడ్డి మాట్లాడారు. పాత వాహనానికి కూడా నిర్ణీత వ్యవధిలోపు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్‌లను అమర్చాలని ఆదేశించారు. ప్రభుత్వ వాహనాలపై అధికారుల హోదాతో కూడిన నేమ్ బోర్డులు ఉన్నాయని, అలా చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. అది ప్రభుత్వ వాహనం మాత్రమే అయి ఉండాలి అని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని రవాణా, అద్దె వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రక్కులు ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా రేడియం టేప్‌ను బిగించేలా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే అన్ని ప్రధాన కూడళ్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని రవాణా, పోలీసు శాఖలను ఆదేశించారు. కాగా, ఆర్ అండ్ బీ కార్యదర్శి ప్రద్యుమ్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎజెండా అంశాలను వివరించారు.
15 ఏళ్లు పైబడిన పాత వాహనాలను రద్దు చేసేలా స్క్రాపింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ఆటోమేషన్ సివిల్ వర్క్స్ ప్రతిపాదనలకు రోడ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈ ట్రాక్‌ల అభివృద్ధికి ఆమోదం లభించింది. రాష్ట్రంలో 2014 నుంచి కొత్త వాహనాలకు రవాణాశాఖ హైసెక్యూరిటీ ప్లేట్లు బిగిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సుమారుగా 1.5 కోట్లకుపైగా వాహనాలు ఉండగా అందులో సగం వాహనాలకు మాత్రమే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉన్నాయని చెబుతున్నారు.