కొత్త జిల్లాలపై ప్రభుత్వం నోటిఫికేషన్.. 26 జిల్లాలు ఇవే..!
AP govt begins process of formation of new districts.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు
By తోట వంశీ కుమార్ Published on 26 Jan 2022 8:33 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలుపగా.. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో కొత్తగా మరో 13 జిల్లాలు ఆవిర్భావం కానున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాదిలోపు అన్నిప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. అందుకు అనుగుణంగా 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడుతూనే.. భౌగోళిక, సామాజికి, సాంస్కృతిక పరిస్థితుల్ని, సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించారు.
కొన్ని జిల్లాలకు పాత పేర్లే ఉండగా.. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు మహనీయుల పేర్లను పెట్టింది. ప్రాథమిక నోటిఫికేషన్లపై స్థానికుల నుంచి అభ్యంతరాలు, సూచనలు ఉంటే స్వీకరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. 30 రోజుల్లోగా (ఫిబ్రవరి 26) అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని స్పష్టం చేశారు.
గెజిట్ ప్రకారం 26 జిల్లాలు ఇవే..
1.శ్రీకాకుళం, 2.మన్యం(పార్వతీపురం), 3.విజయనగరం, 4.అల్లూరిసీతారామరాజు(పాడేరు), 5.విశాఖపట్నం, 6.అనకాపల్లి, 7.కాకినాడ, 8.కోనసీమ(అమలాపురం), 9.తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం), 10.పశ్చిమగోదావరి(భీమవరం), 11.ఏలూరు, 12.కృష్ణా(మచిలీపట్నం), 13.ఎన్టీఆర్(విజయవాడ), 14.గుంటూరు, 15.పల్నాడు(నరసవరావుపేట), 16.బాపట్ల, 17.ప్రకాశం(బంగోలు), 18.నెల్లూరు, 19.కర్నూలు, 20.నంద్యాల, 21.అనంతపురం, 22.శ్రీసత్య సాయి(పుట్టపర్తి), 23.కడప, 24.అన్నమయ్య(రాయచోటి), 25.చిత్తూరు, 26.శ్రీబాలాజీ(తిరుపతి)
పరిపాలనా సౌలభ్యం, పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని వైసీపీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై వైసీపీ ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. 2021 జనాభా గణన ముందుకు రావడంతో పునర్వ్యవస్థీకరణ కొంత ఆలస్యమైంది. అయితే.. కరోనా కారణంగా జన గణన వాయిదా పడింది. దీంతో జనగణన కంటే ముందుగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం బావిస్తోంది. అందుకనుగుణంగానే చర్యలు చేపట్టింది.
ఇక భౌగోళిక పరిస్థితులను బట్టి కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ కమిటీ పలు మార్పులు, సిఫారసులు చేసింది. విజయనగరం పార్లమెంటు పరిధిలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాలో కలుపుతూ ప్రతిపాదన చేసింది. భౌగోళికంగా ఎచ్చెర్ల శ్రీకాకుళానికి దగ్గరగా ఉండటంతో పాటు పోలీస్ బెటాలియన్, ట్రిపుల్ ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ లాంటి ఆదాయ వనరులు, విద్యాసంస్థలు ఉండడంతో ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో ప్రజలకు అన్నీ సౌకర్యాలు అందేలా కొత్త జిల్లాల సరిహద్దులను నిర్ణయించారు.