ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. తాడి చెట్టు మీద నుండి పడి మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైన వారి కుటుంబాలను ఆదుకోవడానికి 'వైఎస్ఆర్ గీత కార్మిక భరోసా' పథకాన్ని ప్రకటించింది. అలాగే మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైన కల్లుగీత కార్మికుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ హామీ మొత్తంలో రూ.5 లక్షలు కార్మిక శాఖ, మరో రూ.5 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా రూపంలో అందజేస్తుంది.
కల్లు తీసే సమయంలో ప్రమాదవశాత్తు అంగవైకల్యం పొందిన వారు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు ఎక్సైజ్ శాఖ వికలాంగ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన రాష్ట్ర కల్లుగీత విధానం 2022-2027 ప్రకారం ఎక్సైజ్ శాఖ ఈ పరిహారం ప్రకటించింది. ఈ పథకం రాష్ట్రంలోని చాలా మంది గీతకార్మిక కుటుంబాలకు అండగా నిలవనుంది. రాష్ట్రంలో 95,245 కల్లుగీత కుటుంబాలు.. తమ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి.
ప్రతి ఏటా ప్రమాదాల బారిన పన్నెండు వందల మంది
ప్రతి సంవత్సరం దాదాపు 1200 మంది కల్లు తీస్తూ ప్రమాదానికి గురవుతున్నారు. ఇందులో 40 శాతం మంది మరణిస్తున్నారు. మిగిలిన వారు శాశ్వత అంగవైకల్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్లుగీత కార్మిక సొసైటీలను ఏర్పాటు చేసి కల్లు గీత కార్మిక సంక్షేమం కోసం కృషి చేస్తోంది. షెడ్యూల్డ్ ప్రాంతాలలో షెడ్యూల్డ్ జాతుల వారు కల్లు గీసుకోవడం కోసం కూడా ఐదేళ్ల కు లైసెన్స్‌ను ఇస్తున్నారు. తాటి, ఈత వంటి చెట్ల పెంపకానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు.