నేటి నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో నడవనున్న థియేటర్లు
AP Govt allows 100 percent occupancy in Theatres. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Medi Samrat Published on 18 Feb 2022 6:41 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం నాడు అధికారిక ప్రకటన చేసింది. తాజా ప్రకటనతో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవనున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన కారణంగా.. నెల రోజుల కిందట 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడపాలని సీఎం జగన్ సర్కార్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కరోనా మహమ్మారి కేసులు గత పది రోజుల నుంచి క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లపై ఆంక్షలు ఎత్తి వేస్తూ నిన్న జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఇదిలావుంటే.. రాష్ట్రంలో నిన్న కరోనా కేసులు సంఖ్య ఐదు వందలకుపైగా నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,339 పరీక్షలు నిర్వహించగా.. 528 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,030కి చేరింది. కరోనా వల్ల నిన్న ఇద్దరు మృత్యువాత పడ్డారు.
కోవిడ్ వల్ల చిత్తూరు మరియు కృష్ణా జిల్లాలలో ఒక్కొక్క రు చొప్పున మరణించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,707గా ఉంది. నిన్న 1,864 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,90,853కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,470 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,29,16,247 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.