ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురైయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం ఆయన్ను ప్రత్యేక విమానంలో బుధవారం విజయవాడ నుంచి హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం గవర్నర్ హరిచందన్‌కు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. గవర్నర్ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారని గవర్నర్ బంగ్లా అధికారులు తెలిపారు. గవర్నర్ ప్రస్తుతం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం గవర్నర్ హెల్త్ బుటిటెన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ 2019 జూలై 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు భార్య సుప్రవ హరిచందన్, కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ ఉన్నారు. 1971లో జన సంఘ్‌లో చేరిన బిశ్వభూషణ్.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004-09 మధ్య ఒడిశా మంత్రిగానూ పని చేశారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా లాయర్‌గా, రచయితగానూ హరిచందన్ గుర్తింపు పొందారు.