ప్రజల ముంగిటకే "మీ సేవలు"..వాట్సాప్ గవర్నెన్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వాట్సాప్ గవర్నెన్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By - Knakam Karthik |
ప్రజల ముంగిటకే "మీ సేవలు"..వాట్సాప్ గవర్నెన్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా ప్రజలకు సుమారు 400కి పైగా పౌర సేవలు ప్రభుత్వం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాట్సప్ గవర్నెన్స్ పై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. "మీ సేవ"తో నిమిత్తం లేకుండా పూర్తిగా వాట్సప్ ద్వారా నే పౌర సేవల దిశలో అడుగులు వేస్తోంది. ప్రతి ఇంటికి వెళ్లి వాట్సప్ గవర్నెన్స్‌ను స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది ప్రచారం చేయనున్నారు. ప్రభుత్వ నిర్వహించిన సర్వే లో వాట్సప్ గవర్నెన్స్ పై అవగాహన లేమీ, భయాందోళనలు బయటపడ్డాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు మీ సేవ కేంద్రాలు ద్వారా పౌర సేవలు అందిస్తుండగా..ఇకపై వాట్సాప్ ద్వారానే పౌర సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందాలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది ప్రదర్శనలు చేయనున్నారు. ఎన్ని ఇళ్లకు వెళ్లారు? ఎంత మంది కి ప్రచారం చేశారు..అలాగే ఎంత మంది ఫోన్ లలో వాట్సప్ పై అవగాహన కల్పించారో నమోదు చేయనున్నారు. కాగా ప్రతి పంచాయతీ కార్యదర్శి/ వార్డు అడ్మిన్ సెక్రటరీ మిగిలిన సిబ్బందితో తమ పరిధిలోని అన్ని ఇళ్ళు కవరయ్యేలా చూడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేసింది. గ్రామ రెవిన్యూ అధికారి, సర్వే అసిస్టెంట్స్ / వార్డు రెవిన్యూ సెక్రటరీ— రెవెన్యూ, ల్యాండ్ సంబంధిత సేవలపై అవగాహన కల్పించేలా అదేశాలు ఇచ్చింది. ఎనర్జీ అసిస్టెంట్స్ / ఎనర్జీ సెక్రటరీలు — విద్యుత్ బిల్లులు, కొత్త కనెక్షన్లు, ఫిర్యాదులపై వాట్సాప్ సేవలను వివరించాలని ప్రభుత్వం సూచన చేసింది. అగ్రికల్చర్, హర్టికల్చర్, వెటర్నరి, ఫిషరీస్, ఎ యన్ యం / వార్డు హెల్త్ సెక్రటరీలు - శాఖల వారీగా వాట్సాప్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించే భాద్యత అని పేర్కొంది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ క్యాంపెయిన్ లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది.