నేటి నుంచి టమాటాల కొనుగోళ్లు.. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు

తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. టమాటా ధరల పతనం నేపథ్యంలో నేటి నుంచి రైతుల పంటను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.

By అంజి
Published on : 21 Feb 2025 8:27 AM IST

AP government, procurement, tomatoes, APnews

నేటి నుంచి టమాటాల కొనుగోళ్లు.. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు 

తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. టమాటా ధరల పతనం నేపథ్యంలో నేటి నుంచి రైతుల పంటను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేసింది. అయితే ఏ రేటుతో అనేది వెల్లడించలేదు. ఆ టమాటాను రైతు బజార్లలో విక్రయించనుంది. అవసరం మేరకు పొరుగు రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేయాలని మార్కెట్‌ శాఖ అధికారులను ఆదేశించింది. కాగా నిన్న సాయంత్రం మంత్రి అచ్చెన్నాయుడు మార్కెటింగ్ డైరెక్టర్‌ విజయ సునీత, సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

టమాటా కొనుగోళ్లకు అధికారులు తక్షణమే చర్యలు ప్రారంభించాలని, పరిస్థితి తనకు నేరుగా ఎప్పటికప్పుడు తెలియచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన టామాటాను పొలాల్లో వదిలేయలేక.. గిట్టుబాటు ధర పొందలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి, పత్తికొండ మార్కెట్‌లో కిలో రూ.4కు చేరింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమాటాలను అమ్మే పరిస్థితి లేదని, పారేయడం తప్ప చేసేదేమీ లేదని వాపోతున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా రూ.15 నుంచి రూ.20 పలుకుతోంది.

Next Story