అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దుకానున్నాయి. వాటి స్థానంలో రాజముద్రతో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆగస్టు 15 నుంచి 31 వరకు తొలి విడతగా కొత్త పాస్‌బుక్స్‌ను కొంతమంది రైతులకు అందిస్తారని తెలుస్తోంది. గత ప్రభుత్వం పాస్‌బుక్స్‌పై అప్పటి సీఎం జగన్ ఫొటో ముద్రించిన విషయం తెలిసిందే. వాటిని మార్చి రాజముద్రతో కొత్త పట్టదారు పుస్తకాలను రూపొందించింది. విడతల వారీగా 10 లక్షల మందికిపైగా రైతులకు ఈ కొత్త పాస్‌బుక్స్ అందించనుంది.
తొలి విడతలో భాగంగా పాసుపుస్తకాలు డివిజన్ కేంద్రాలకు చేరుకుంటున్నాయి. అక్కడ మండలాల వారీగా విభజన చేసి పంపుతున్నారు. ఈనెల 15వతేదీ నుంచి 31వతేదీ వరకు రైతులకు వాటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామాల వారీగా తహసీల్దార్ల ఆధ్వర్యంలో సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం కానున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను కూడా అధికారులు రూపొందిస్తున్నారు.