కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల సాయం!
సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి
కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల సాయం!
అమరావతి: సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 2వ తేదీన రైతుల ఖాతాల్లో రూ. 7 వేలు జమ చేయనుంది. అయితే కౌలు రైతులకు తొలి, రెండో విడత డబ్బులు రూ.14 వేలు ఒకేసారి రెండో విడతలో జమ చేయనున్నట్టు సమాచారం. కౌలు రైతులకు కార్డుల జారీ పూర్తయ్యాక రెండు విడతల నిధులను ప్రభుత్వం ఒకేసారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 2వ తేదీన ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 46.50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. మొత్తం రూ.3,156 కోట్లను జమ చేయనుంది. పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6 వేల రూపాయలు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఇవ్వనున్నది. ఇప్పటికే అర్హులను గుర్తించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని రాష్ట్ర అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అటు ఈ కేవైసీ పూర్తి చేయని వారు.. వెంటనే సరైన పత్రాలు అందించి ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.