తెల్ల రేషన్ కార్డు కలిగిన రైతులు, పశువుల పెంపకందారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి 50 శాతం డిస్కౌంట్‌తో పోషకాలతో కూడిన దాణాలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వేసవి కాలంలో పశుగ్రాసం దొరక్క పశువుల పెంపకందారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగిస్తూ 50 శాతం రాయితీపై రైతులకు పశువుల దాణా పంపిణీ చేయాలని ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. 50 కేజీల బస్తాను రూ.1100లకు కొనుగోలు చేసి రైతులకు రూ.555లకు అందించాలని నిర్ణయించింది.
రాయితీ కల్పించడం ద్వారా ఆర్థికంగా ప్రభుత్వం మీద భారం పడినప్పటికీ వేసవి కాలంలో పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు, పాల దిగుబడి తగ్గకుండా చూసుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. 50 శాతం రాయితీతో పశువుల దాణా పొందేందుకు తెల్ల రేషన్ కార్డు కలిగినవారు అర్హులు. ఒక్కో కుటుంబానికి 2 పెద్ద పశువులు, ఒక దూడకు కలిపి గరిష్టంగా 90 రోజులకు పశువుల దాణాను అందిస్తారు. విడతల వారీగా 450 కిలోల పశువుల దాణాను సబ్సిడీ మీద అందజేస్తారు. ఇక ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.69 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం 31,067 టన్నుల పశువుల దాణాను ఏపీ పశుసంవర్థక శాఖ పంపిణీ చేయనుంది.