ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌దారులకు మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే పీడీఎస్ కింద సన్న బియ్యం అందించనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎండీఎమ్‌లో మాదిరిగా దీనికీ క్యూఆర్ కోడ్ అమలు చేస్తామన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అనంతరం మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. రేషన్ బియ్యం నిల్వ కోసం రాష్ట్రంలో ఎఫ్‌సీఐ నుంచి అదనపు గోదాంలు ఏర్పాటుకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అంగీకరించారని తెలిపారు. 2025 - 26లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా.. 25 రోజుల్లో 17.37 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నట్టు చెప్పారు.
రైతుల ఖాతాల్లో 24 గంటల్లో నగదు జమ చేస్తున్నామని వివరించారు. గతేడాది రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి.. 41 వేల ప్రభుత్వ పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి అదనంగా రాగి, గోధుమలను కేంద్రం కేటాయించనుందన్నారు. జనవరి 1 నుంచి రాష్ట్రంలోని రైస్ కార్డుదారులందరికీ రాగులు, గోధుమ పిండి అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీడీఎస్ బియ్యం సరఫరాకు క్యూఆర్ ట్యాగ్ వినియోగించేందుకు పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. దీని ద్వారా బియ్యం అక్రమ రవాణాను అరికట్టవచ్చని తెలిపారు.