ఏపీలోని జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వలంటీర్ల వ్యవస్థను తీసుకుని వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందించే లక్ష్యంతో వీరిని నియమించారు. 50 ఇళ్లకు ఒక వాలంటీరు లెక్కన రాష్ట్రంలో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. అయితే.. వలంటీర్లకు షాకిచ్చింది ప్రభుత్వం. గ్రామ, వార్డు వలంటీర్ల విషయంలో కీలక సర్కులర్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వయోపరిమితి అధికంగా, అత్యల్పంగా ఉన్నవారు వలంటీర్లుగా పనిచేస్తున్నారని.. వారందరినీ వెంటనే తొలగించాలని ప్రభుత్వం జాయింట్ కలెక్టర్లను ఆదేశించింది. గ్రామ, వార్డు వలంటీర్లుగా 18-35 ఏళ్ల మధ్యనున్న వారినే కొనసాగించాలని జిల్లాల జేసీలకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది.
18 ఏళ్ల లోపు.. 35 ఏళ్లు దాటిన వారిని విధుల నుంచి తప్పించాలని సూచించింది. వీరిలో ఇప్పటికే 35 ఏళ్లు నిండిన వలంటీర్లకు సీఎఫ్ ఎంఎస్ సిస్టమ్ ద్వారా అందించే జీతాలు రావడం లేదు. గత కొంతకాలం నుంచి ఈ అంశం చర్చనీయాంశమైంది. దీనితో 35 ఏళ్లు నిండిన వారెవరైనా ఉంటే వారిని వెంటనే ఆ విధుల నుంచి తొలగించాల్సిందిగా కమిషనర్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి జిల్లాలోనూ వేల సంఖ్యలో గ్రామ, వార్డు వలంటీర్లు విధులకు దూరం అయ్యే అవకాశం ఉంది.