'దివ్యాంగ పింఛన్లపై అపోహలొద్దు'.. అర్హులందరికీ ఇస్తామన్న ఏపీ సర్కార్
దివ్యాంగ పింఛన్లపై అపోహలొద్దు.. అర్హులందరికీ పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి
'దివ్యాంగ పింఛన్లపై అపోహలొద్దు'.. అర్హులందరికీ ఇస్తామన్న ఏపీ సర్కార్
దివ్యాంగ పింఛన్లపై అపోహలొద్దు.. అర్హులందరికీ పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘ఇప్పుడు మళ్లీ పింఛన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో వేలు, లక్షల మంది అనర్హులకు, పార్టీ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు. వీటిపై వెరిఫికేషన్ జరుగుతుంటే... 4 లక్షల పింఛన్లు తీసేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక్క పింఛను కూడా ఇప్పటికి తీయలేదు. అర్హులైన వారి ఏ ఒక్క పింఛను కూడా తీసేది లేదు. అనర్హులకు తప్పుడు పత్రాలతో పింఛన్లు ఇప్పించారు.
అనర్హులకు ఫించన్లు ఇచ్చి.. అర్హులను వైసీపీ పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం అలా చేయదు. అనర్హులను పక్కన పెడుతుంది.. అర్హులకు పింఛన్లు ఇస్తుంది’ అని స్పష్టం చేశారు. ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టామని, ఉచిత బస్సు అంటే కొందరు ఎగతాళి చేశారని ముఖ్యమంత్రి అన్నారు. అయినప్పటికీ ఆచరణలో చేసి చూపించామని తెలిపారు. ‘ఇప్పటివరకూ కోటి మంది మహిళలు ఉచిత బస్సు ద్వారా ప్రయాణం చేశారు. 19వ తేదీన నాకెంతో ఇష్టమైన పీ4ను క్షేత్ర స్థాయిలో అమలును ప్రారంభించాం. 21వ తేదీన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించాం. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. రాష్ట్రంలో పేదరికం అనే మాట వినపడకూడదని పని చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.