Andhra Pradesh: విద్యా మిత్ర కిట్లకు రూ.830 కోట్ల నిధులు విడుదల
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో...
By - అంజి |
Andhra Pradesh: విద్యా మిత్ర కిట్లకు రూ.830 కోట్ల నిధులు విడుదల
అమరావతి: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో స్టూడెంట్ కిట్ల (సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర) కొనుగోలుకు రూ.830 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చింది. ఇందులో కేంద్రం వాటా రూ.157 కోట్లుగా ఉంది. రాష్ట్రం వాటా కింద రూ.672.84 కోట్లు ఇస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు నోట్‌బుక్‌లు, బెల్ట్, షూలు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, యూనిఫాం క్లాత్‌లతో కిట్లు పంపిణీ చేయనుంది.
అలాగే యూనిఫాం కుట్టు కూలీని కూడా పేరెంట్స్‌కు అందజేయనుంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు 'సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్థి మిత్ర' పేరుతో ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. టెండర్ల ద్వారా కిట్ల సరఫరా, పంపిణీదారులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
ఇది విద్యార్థుల చదువుకు ఎంతగానో చేయూతనిస్తుంది. కిట్లలో భాగంగా అందించే ప్రతి వస్తువు విద్యార్థుల అభ్యసన ప్రక్రియకు తోడ్పడుతుంది. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో టెండర్లు ఖరారు కానున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో మూడు దశల్లో నమూనాల నాణ్యతను, నిర్ధారణను చేపట్టనున్నారు. మే నెలలో జిల్లా, మండల స్టాక్ పాయింట్లకు సామగ్రిని చేర్చాలని, నాలుగో వారంలో మండల స్టాక్ పాయింట్లలో కిట్ల తయారీని పూర్తి చేయనున్నారు. జూన్‌లో విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయనున్నారు.