నేతన్నలకు శుభవార్త..ఉచిత విద్యుత్‌పై ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik
నేతన్నలకు శుభవార్త..ఉచిత విద్యుత్‌పై ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు కొత్త పథకం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 93 వేల మంది నేతన్నల గృహాలకు, 10,534 మరమగ్గాలకు ప్రయోజనం చేకూరనుంది.
కాగా ఈ పథకం అమలుకు ప్రతి సంవత్సరం రూ.125 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని సర్కార్ భావిస్తోంది. ఇంధన శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాత పథకం అమలు విధివిధానాలను ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా సరైన చర్యలు తీసుకోవాలని చేనేత, టెక్స్‌టైల్ శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
చేనేత వస్త్రాల తయారీని వృత్తిగా ఎంచుకున్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన విద్యుత్ కంటే ఎక్కువ వినియోగించినా, లబ్ధిదారులు రాయితీ మొత్తాన్ని కోల్పోకుండా ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది. ఒక వేళ పరిమితికి మించి విద్యుత్‌ను వాడితే, అదనపు యూనిట్లకు మాత్రమే వినియోగదారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.