'లోన్ యాప్'లపై కఠిన చర్యలు
AP government orders to take strict action against loan apps.రాష్ట్రంలో లోన్‌యాప్‌ల ఆగడాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 8 Sep 2022 8:21 AM GMTరాష్ట్రంలో లోన్‌యాప్‌ల ఆగడాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ అప్పు చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారు. తమ పరువుపోయిందనే కారణాంగా ఎంతో మంది బాధితులు తమ జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేని లోన్ యాప్ లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
రాజమండ్రి ఘటనపై స్పందించిన సీఎం
రుణయాప్‌ల వలలో పడి బుధవారం రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరు చిన్నారులు నాగసాయి(4), లిఖిత శ్రీ(2) లు అనాథలు మిగిలారు. ఈ ఘటనపై సీఎం జగన్ చలించిపోయారు. చిన్నారులు ఇద్దరికి చెరో రూ.5లక్షల సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మాధవీలతకు ఆదేశాలు జారీ చేశారు.
ఏం జరిగిందంటే..?
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు పదేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం రాజమహేంద్ర వరం వచ్చారు. రమ్యలక్ష్మితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాగసాయి(4), లిఖిత శ్రీ(2) లు సంతానం. దుర్గారావు పెయింటింగ్ పని చేస్తుండగా..రమ్య లక్ష్మీ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల వీరు రెండు ఆన్‌లైన్ రుణయాప్‌ల నుంచి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. నిర్ణీత సమయంలో తీర్చకపోవడంతో వేదింపులు మొదలయ్యాయి. వారి బెదిరింపులు తాళలేక కొంత మొత్తం చెల్లించారు.
మరింత చెల్లించాలని లేదంటే.. రమ్యలక్ష్మి ఫోటోలను అసభ్యంగా మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతామని హెచ్చరించారు. అంతేకాకుండా దుర్గాప్రసాద్ బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి అప్పు విషయాన్ని చెప్పారు. దీంతో పరువు పోయిందని బావించిన భార్యా భర్తలిద్దరూ మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.