అమరావతి: కొత్త పెన్షన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త పెన్షన్ల మంజూరుకు కసరత్తులు చేస్తోంది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశం అయ్యింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వానికి తుది నివేదికను అందించనుంది. దాన్ని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత జులైలో కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అన్ని కేటగిరీలకు కలిపి దాదాపు 6 లక్షల దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే దాదాపు 90 వేల మందికి వితంతువు పెన్షన్లను జూన్ 1 నుంచి అందించనున్నట్టు సమాచారం. మే నెలలో వీరికి సంబంధించిన దరఖాస్తులు తీసుకోనున్నారు. ప్రస్తుతం 63.32 లక్షల మంది పెన్షన్ల కోసం రూ. 2వేల722 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. కొత్త పింఛన్లతో నెలకు మరో రూ.250 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. వైసీపీ హయాంలో ఎన్నికల నాటికి 2.3 లక్షల పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.