అమరావతి: బీసీ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను అనుమతి కోసం బీసీ సంక్షేమ శాఖ సీఎం చంద్రబాబుకు పంపింది. దాదాపు 80 వేల మంది బీసీ, ఈబీసీ మహిళలకు 90 రోజుల పాటు టైలరింగ్‌పై శిక్షణ ఇవ్వనుంది. ఆ తర్వాత రూ.24,000 విలువైన కుట్లు మిషన్లు అందిస్తుంది. అలాగే డీ ఫార్మా, బీ ఫార్మసీ కోర్సులు చేసిన యువత జనరిక్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు రూ.8 లక్షలు సాయం చేయనుంది. ఇందులో రూ.4 లక్షలు సబ్సిడీ, రూ.4 లక్షలు రుణంగా ఉంటుంది. త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేయనుంది.
సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లోన్‌లకు సంబంధించి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసేందుకు ఓబీఎంఎస్ వెబ్‌సైట్‌ను రెడీ చేస్తున్నారు. మరోవైపు ట్రైనింగ్ ఇచ్చేందుకు పలు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. మహిళలకు రోజుకు 4 గంటల చొప్పున 90 రోజుల పాటు టైలరింగ్‌లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇందుకోసం శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అటు ప్రతి మండల కేంద్రంలో ఒక జనరిక్ షాపును ఏర్పాటు చేయడం ద్వారా స్వయం ఉపాధి కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. డీ ఫార్మా, బీ ఫార్మసీ కోర్సు సర్టిఫికెట్ కలిగిన బీసీ, ఈబీసీ యువతను ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.