డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..వయోపరిమితి పెంచిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..వయోపరిమితి పెంచిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వయోపరిమితి పెంపు ఈ మెగా డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. భవిష్యత్తులో విడుదల చేసే నోటిఫికేషన్లకు ఈ సడలింపు వర్తించదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
అభ్యర్థుల వయోపరిమితిని లెక్కించేందుకు గాను, 2024 జులై 1వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించినట్లు ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. ఈ నిర్ణయంతో వయోపరిమితి కారణంగా గతంలో అవకాశం కోల్పోయిన కొంతమంది అభ్యర్థులకు కూడా ఈసారి మెగా డీఎస్సీ పరీక్ష రాసేందుకు మార్గం సుగమమైంది.
మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80 శాతం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 ఖాళీలు ఉండనున్నాయి. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉంటాయి.