ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పించన్ల పంపిణీలో వెసులుబాటు కల్పించింది. సామాజిక భద్రత పింఛన్లను ఉదయం 7 గంటల నుంచి మాత్రమే అందించేలా మార్పులు చేసింది. ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద ప్రతి నెల మొదటి తేదీనాడు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే తెల్లవారుజామునే పింఛన్లు పంపిణీ చేయాలన్న రూల్ ఏం లేకున్నా.. చాలా జిల్లాల్లో అధికారుల ఒత్తిడి మేరు ఉదయం 4 గంటల నుంచే ప్రారంభిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఉదయం 7 గంటల నుంచి మాత్రమే పింఛన్లను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది.
అందుకనుగుణంగా యాప్‌లో పలు మార్పులు చేసింది. అంతేకాకుండా లబ్ధిదారుడి ఇంటి నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పింఛన్ పంపిణీ చేస్తుంటే, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు, స్కూళ్లు, కాలేజీల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు, ఉపాధి హామీ పని ప్రదేశంలో, బంధువుల ఇళ్ల ఉన్న ఉన్న వారికి పింఛన్లు పంపిణీ చేసినా నమోదుకు ఛాన్స్ కల్పించింది. అలాగే ప్రభుత్వ సందేశాన్ని లబ్ధిదారులకు తెలిపేలా 20 సెకన్ల ఆడియోని యాప్‌లో ప్లే చేయనున్నారు.