దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు శుభవార్త..ఆ ప్రోత్సాహకాలు విడుదల
దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది
By - Knakam Karthik |
దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు శుభవార్త..ఆ ప్రోత్సాహకాలు విడుదల
అమరావతి: దళిత గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 11451 మంది పారిశ్రామికవేత్తలకు రూ. 269.9 కోట్లను పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో దళిత గిరిజన పారిశ్రామికవేత్తలను ఈరంగంలో మరింతగా వృద్ధిలోకి తీసుకెళ్లేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకు రెండు దశలలో ఈ ప్రోత్సాహకాలు అందించామని మంత్రి తెలిపారు.
మొదటి విడతగా 2025 అక్టోబర్ నెలలో 6675 మంది ఎస్ సి పారిశ్రామికవేత్తలకు రూ. 178.75 కోట్లు 1,159 మంది ఎస్ టి పారిశ్రామికవేత్తలకు రూ.30.94 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, ఆమోదం పొందిన యూనిట్లను కవర్ చేయడానికి, బడ్జెట్ లభ్యత ఆధారంగా ప్రభుత్వం ఇప్పుడు రెండో విడతగా అదనంగా నిధులను విడుదల చేసిందని మంత్రి తెలియజేశారు. ఈ విడతలో మంగళవారం (నిన్న) 3,122 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.53.05 కోట్లు, 495 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.7.16 కోట్లు విడుదల చేయటం జరిగిందని మంత్రి వివరించారు.
ఈ విధంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు, రెండు విడతలలో కలిపి రూ.231.80 కోట్లు 9,797 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలకు, అలాగే రూ.38.10 కోట్లు 1,654 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం అనేక ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహక నిధుల చెల్లింపుల కోసం ప్రభుత్వం దశలవారీ విధానంలో ఈ నిధులను విడుదల చేసిందని ఆయన తెలియజేశారు. ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చూపిస్తున్న దృఢమైన నిబద్ధతకు ఈ నిధుల విడుదలే నిదర్శనమని, వారి సంస్థలు తక్షణ అవసరాలు మరియు దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎంతగానో దోహదపడుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు.