అమరావతి: పెన్షన్‌కు అనర్హులుగా నోటీసులు అందుకున్న దివ్యాంగులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దివ్యాంగ పెన్షన్‌కు అప్పీలు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. తాము పెన్షన్‌కు అర్హులమని భావించే వారు వెంటనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. సమీపంలోని ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తులు ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
అర్హుల గుర్తింపులో అక్రమాలు జరిగాయని, నోటీసులు అందుకున్నవారు సదరం శిబిరాల్లో మరోసారి వైకల్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనారోగ్యం, దివ్యాంగుల కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అనర్హులుగా గుర్తించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. 40 శాతం కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారికి పెన్షన్లను రద్దు చేశారు. అలాగే కొందరి పెన్షన్ల కేటగిరీని మార్చి సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.