అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. చెత్త పన్ను నుంచి ప్రజలను విముక్తి చేసింది. నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 డిసెంబర్ 31 నుంచి రద్దు అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను వసూలును ప్రారంభించిన విషయం తెలిసిందే. 2021 నవంబర్‌లో చెత్త పన్ను వసూలు ప్రారంభమైంది.
దీన్ని రద్దు చేస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మేరకు 2024 డిసెంబర్‌లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించగా గవర్నర్ అనుమతితో ఇటీవల గెజిట్ విడుదల అయ్యింది. చెత్త పన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టం - 1965లో చేర్చిన సెక్షన్లను తొలగిస్తున్నట్టు పేర్కొంది. 2021లో నవంబర్‌లో 40 పుర, నగరపాలిక సంస్థల్లో ప్రజల నుంచి వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను వసూలు ప్రారంభించింది.