AP Jobs: 3,220 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని 18 యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమగ్ర రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది

By అంజి  Published on  31 Oct 2023 4:53 AM GMT
AP Government, AP University Jobs, , APnews

AP Jobs: 3,220 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని 18 యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమగ్ర రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. 3,220 ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దీర్ఘకాల సమస్య సహేతుకమైన విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని, అకడమిక్ ఎక్సలెన్స్‌ను కొనసాగించడానికి, పరిశోధనా నైపుణ్యాన్ని పెంపొందించడానికి అవకాశంగా మార్చబడుతోంది.

సీఎంవో ప్రకటన ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 3220 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా యూనివర్శిటీలలో ఉద్యోగాల భర్తీ నిర్వహిస్తారు. పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్‌లాగ్‌ పోస్టులతో పాటు, 2,942 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి యూనివర్శిటీలు విడివిడిగా ప్రకటనలు విడుదల చేశాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి 418 ప్రొఫెసర్‌ పోస్టులు, 801 అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 2001 ట్రిపుల్‌ఐటీల లెక్చరర్‌ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి. నవంబరు 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల భర్తీకి 2017, 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్త నోటిఫికేషన్‌ని ఆయా యూనివర్సిటీలు విడుదల చేశాయి. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా కోర్టు తీర్పుకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుంది. స్క్రీనింగ్‌ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత స్క్రీనింగ్‌ పరీక్షా అర్హుల జాబితాను నవంబర్‌ 30న ప్రకటిస్తాయి. డిసెంబరు 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 8న తుది జాబితాను ప్రకటిస్తాయి.

కొత్తగా రిజర్వేషన్‌ రోస్టర్‌ పాయింట్లతో యూనివర్సిటీలు పోస్టులను ప్రకటించాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌లు, ప్రొఫెసర్‌ పోస్టులను విశ్వవిద్యాలయాల స్థాయిలోనే నియామకాలు చేపడతారు. యూనివర్సిటీల్లో దశాబ్దాలుగా భర్తీకి నోచుకోని అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల్లో నియామకాలను చేపట్టబోతున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఉన్నత విద్యా మండలి 'ఉమ్మడి పోర్టల్‌' ద్వారా మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు ఒకే దరఖాస్తు ఫీజుతో అన్ని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ఓపెన్‌ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,500 , ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు (పర్సన్‌ బెంచ్‌ మార్క్‌ విత్‌ డిజేబిలిటీ) రూ.2 వేలు, ప్రవాస భారతీయులైతే 50 డాలర్లు/రూ.4.200 ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో పరీక్షలు రాసేవారు విడివిడిగా ఫీజులు చెల్లించాలి. ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3 వేలు, ప్రవాస భారతీయులైతే ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.150 డాలర్లు/రూ.12,600, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 100 డాలర్లు/రూ.8,400 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

https://recruitments.universities.ap.gov.in/Masters/Home.aspx వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఆయా వర్సిటీలు ప్రత్యేక ఫోన్‌ నంబర్లను అందుబాటులో ఉంచాయి.

Next Story