Andhrapradesh: ఎస్సై పోస్టుల నియామకాలపై కీలక నిర్ణయం

సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్‌ నియామక నిబంధనలను సవరిస్తూ ఉత్వర్వులు ఇచ్చింది.

By అంజి  Published on  18 Feb 2025 9:30 AM IST
AP government, SI posts, APnews

Andhrapradesh: ఎస్సై పోస్టుల నియామకాలపై కీలక నిర్ణయం

అమరావతి: సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్‌ నియామక నిబంధనలను సవరిస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ పోలీస్‌ సివిల్‌ సబార్డినేట్‌ సర్వీసు రూల్స్‌లో స్వల్ప మార్పులు చేసింది. దాని ప్రకారం నియామకాలకు సంబంధించి.. ఎస్సై (సివిల్) పోస్టులను 65 శాతం (గతంలో 55 శాతం) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాలని సూచించింది. హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఏస్‌ఐలను ప్రమోషన్‌ ద్వారా 30 శాతం, ఏఆర్‌, ఏపీఎస్సీ విభాగాల్లోని రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీల ద్వారా 5 శాతం భర్తీ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

గత సంవత్సరం జులై 1 నుంచి ఏర్పడిన ఖాళీలను ఈ విధానంలో భర్తీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర, కేంద్ర అవార్డులు పొందినవారికి కేటగిరీలను బట్టి 5 - 25 మార్కులు ఇచ్చి నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా చేపట్టే నియామకాల్లో పోలీస్‌ ఎగ్జిక్యూటివ్‌ సిబ్బందికి 5 శాతం, మినిస్టీరియల్‌ సిబ్బందికి ఒక శాతం, ప్రతిభావంతులైన క్రీడాకారులకు 2 శాతం, ఎన్‌సీసీ వారికి 3 శాతం, పోలీస్‌ సిబ్బంది పిల్లలకు 2 శాతం రిజర్వ్‌ చేయాలని పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story