ఆంధ్రప్రదేశ్‌కు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా అమరావతి సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో నివసించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్కడ భూమి లేని వారికి ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ.2,500ను రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. రేపటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది.
దీంతో 17,215 మంది లబ్ధిదారులకు ఇకపై రూ.5,000 పెన్షన్ అందనుంది. ఈ మేరకు ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మీ బుధవారం నాడు గెజిట్‌ను విడుదల చేశారు. ఇటీవల ఫిరంగిపురం సభలో పెన్షన్ పెంచుతామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పెన్షన్ పెంచాలని కోరుతూ 16వ తేదీన సిఆర్‌డిఎ కమిషనరు ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. దీన్ని వెంటనే ఆమోదిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.