అమరావతి: దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగుల కేటగిరీలోని పింఛన్‌లపై తనిఖీలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో ఆలస్యం జరిగింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, చేతులు దెబ్బదినడంతో రూ.6 వేలు పెన్షన్ పొందుతున్న వారికి ఒకటి రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. ఇందులో భాగంగానే వైద్య పరీక్షల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో రోజుకు సుమారు 200 మందికి పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలకు ఎవరెప్పుడు హాజరుకావాలో ముందుగానే సమాచారం అందజేస్తారు. పరీక్షకు హాజరుకాకపోతే వారి పింఛన్ నిలిపివేయబడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని సుమారు 7 లక్షల మంది లబ్ధిదారుల్లో 40 శాతం మంది అనర్హులు ఉండొచ్చని అంచనా. అవయవాలు బాగానే ఉన్నా.. ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్లూ డబ్బులు తీసుకున్నవారి పెన్షన్ కట్ కానుంది.