అమరావతి: కౌలు రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని సొంత భూమి ఉన్న రైతులకే అమలు చేయాలనుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు కౌలు రైతులను కూడా ఇందులో చేర్చాలని నిర్ణయించింది. ఈ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి మూడు దశల్లో రూ. 20 వేల చొప్పున అందజేయనుంది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో ఈ మొత్తాన్ని అందించనుంది. అడవి భూములపై హక్కు కలిగిన వారినీ అర్హులుగా గుర్తించనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించిన జాబితాను తయారు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి తమ పరిధిలోని రైతులను వివరాలను పరిశీలించి అర్హుల లిస్ట్‌ను ఏప్రిల్ 20వ తేదీలోగా 'అన్నదాత సుఖీభవ' వెబ్‌సైట్‌లో సబ్మిట్ చేయాలని సూచించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది. ఫైనాన్షియల్‌గా మంచి పొజిషన్‌లో ఉన్న వారికి ఈ పథకం వర్తించదు. నెలకు రూ. 10 వేలు, ఆపై పెన్షన్ తీసుకునే వారు కూడా ఈ పథకానికి అర్హుల కాదు. ఈ పథకంలో భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబం ఒక యూనిట్‌గా పథకం అమలు చేస్తారు. పిల్లలకు పెళ్లి అయితే వారిని స్పెషల్ యూనిట్‌గా పరిగణించి సాయం అందిస్తారు. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పట్టు సాగు చేసే వారు ఈ పథకానికి అర్హులు. పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదు.