అమరావతి: కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మాతృత్వ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం 120 రరోజులు మాత్రమే ఇస్తున్న సెలవులను 180 రోజులకు పెంచింది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని గతంలో ఉన్న రూల్‌ను తొలగించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇదివరకు ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రసూతి సెలవులు ఉండేవి.. అయితే ఇప్పుడు తాజాగా విడుదల చేసిన జీవోలో ఆ రూల్‌ను తీసేసింది. ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చినా ప్రసూతి సెలవులను పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఇదిలా ఉంటే.. కొత్తగా ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగినులకు కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంతానోత్పత్తిని పెంచాలని సీఎం చంద్రబాబు చాలా రోజులుగా ప్రజలకు పిలుపునిస్తున్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటును 1.5 శాతం నుంచి 2.1 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్ని కాన్పులైనా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేస్తామని ప్రకటించారు.