సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. సిట్ విచారణకు లైన్‌క్లియర్

AP Government Got Relief In Supreme Court. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అంశంపై సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ఊరట లభించింది.

By M.S.R  Published on  3 May 2023 7:30 PM IST
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. సిట్ విచారణకు లైన్‌క్లియర్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అంశంపై సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు కోసమంటూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్‌’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం సూచించింది. హైకోర్టు ముందుగా ఈ విషయంలో జోక్యం చేసుకుందని, అందుకే మధ్యంతర ఉత్తర్వులను తోసిపుచ్చుతున్నామని తెలిపింది. జగన్ ప్రభుత్వం సిట్ ఏర్పాటును నిరసిస్తూ టీడీపీ నేతలు వర్లరామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు ఏపీ హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు.

సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పాపాలు పండాయన్నారు. ఆయన చేసిన తప్పులకు స్టే లు తెచ్చుకుంటూ ఇన్నాళ్ళూ బతికాడని ఆమె విమర్శలు గుప్పించారు. చంద్రబాబు జైలుకు వెళ్ళి చిప్పకూడు తినే రోజులు వచ్చాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు దగ్గర నుండి కోట్లు దోచుకున్నారని.. అమరావతిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొని ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని ఆరోపించారు. సిట్ విచారణలో అందరూ లెక్కలు బయట వస్తాయన్నారు. లోకేష్, చంద్రబాబు సూట్ కేసుల్లోని డబ్బుల లెక్కలు బయటకు వస్తాయన్నారు రోజా.


Next Story