అమరావతి: నిన్నటి బడ్జెట్ రాష్ట్రంలో ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పింది. రాబోయే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పీఎం ఆవాస్ యోజన - ఎన్టీఆర్ నగర్ పథకం కింద ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ఇప్పటికే పురోగతిలో ఉన్న ఇళ్లు కాకుండా అదనంగా మరో 16 లక్షల మందికి ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాది రూ.4,012 కోట్లు కేటాయించింది.
రూ. 2.94 లక్షల కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్.. పేదలకు ఉచితంగా ఇళ్లు, ఇళ్లపట్టాలపై సభలో పయ్యావుల కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందని పయ్యావుల అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ నగర్ పథకం కింది పేద వారికి వారికి 25 లక్షల ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ పథకం ఊతం ఇస్తుందన్నారు.