ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకునే వారికి గుడ్‌న్యూస్‌. లబ్దిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on  6 Nov 2023 7:19 AM IST
AP government, beneficiaries, own houses, APnews

ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

ఏపీ: ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకునే గుడ్‌న్యూస్‌. లబ్దిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో 79 శాతం మందికి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. దీనికి అదనంగా లబ్దిదారుకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది. అలాగే లబ్దిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తోంది. తక్కువ ధరకే ఇంటికి అవసరమైన సామగ్రిని ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 16,06,301 మంది లబ్దిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.

ఇందులో 12,61,203 మందికి పావలా వడ్డీకి రూ.4,443.13 కోట్ల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు మహిళల పేరుతో చేశారు. ఈ నేపథ్యంలోనే పావలా వడ్డీ రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నారు. ఇక పేదల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి వారం ఎన్ని ఇళ్లు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకుని.. ఆ లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పావలా వడ్డీ రుణాలు మంజూరు చేయించడంపై శ్రీకాకుళం, ఎన్టీఆర్, చిత్తూరు, నెల్లూరు, విశాఖ జిల్లా కలెక్టర్లు మరింత దృష్టి సారించాలని సీఎస్‌ ఆదేశించారు.

Next Story