ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బకాయిల వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీని ప్రకటించింది. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారికంగా జీవో నెం.58ని విడుదల చేశారు. ఇప్పటికే వడ్డీ సహా పన్ను చెల్లించిన వారికి ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. అటువంటి వారు పొందే రాయితీ మొత్తాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరం పన్ను బిల్లులో సర్దుబాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు సమయం దగ్గరపడుతుండటంతో, బకాయిల వసూళ్లను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.