అమరావతి: చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నేడు చేనేత సహకార సంఘాల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. డిసెంబర్‌లో ఆప్కో బకాయిల్లో రూ.2.42 కోట్లు చెల్లించారు. సంక్రాంతి సందర్భంగా మరో రూ.5 కోట్లు బకాయిలు చెల్లించాలని మంత్రి సవిత ఆప్కో యాజమాన్యాన్ని ఆదేశించారు. చేనేత ఉత్పత్తుల విక్రయాల కోసం కో ఆప్టెక్స్, టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్‌తో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ప్లిప్‌కార్ట్, అమెజాన్, జియోమార్ట్ ద్వారా కూడా అమ్మకాలు ప్రారంభించామన్నారు.
అటు నిధుల విడుదల కానుండటంతో చేనేత సహకార సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మంత్రి సవితకు చేనేత సహకార సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. నేడు చేనేత సహకార సంఘాల ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. చేనేత సహకార సంఘాల ఆర్థిక బలోపేతానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. చేనేత సహకార సంఘాలకు మరికొన్ని పథకాలు వర్తింపజేస్తున్నామన్నారు. నేతన్నలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.