మామిడి రైతులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
మామిడి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు రూ.260 కోట్ల నిధులు విడుదలకు నిర్ణయించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
By అంజి
మామిడి రైతులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
అమరావతి: మామిడి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు రూ.260 కోట్ల నిధులు విడుదలకు నిర్ణయించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వం కిలోకు అదనంగా రూ.4 మద్ధతు ధర ప్రకటించి మామిడి కొనుగోళ్లు చేపట్టిందన్నారు. ఆ డబ్బులను రేపటి నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తోతాపురి మామిడి ఉత్పత్తి బాగా పెరిగిందన్నారు.
ఈ సారి 2.5 లక్షల టన్నుల మామిడి ఎక్కువగా ఉత్పత్తి అయ్యిందని.. మామిడి ఉత్పత్తి పెరగడంతో ధర తగ్గి చాలా మంది కొనడం లేదన్నారు. తోతాపూరి మామిడిని ఎక్కువగా పల్ఫ్ తయారీ కంపెనీలే కొంటాయని, అయితే ఇప్పటికే పల్ప్ తయారీ కంపెనీల వద్ద గత సంవత్సరం నిల్వలు ఉండటంతో కొనుగోలుకు ముందుకు రావడం లేదని చెప్పారు. కిలోకు రూ.12 ఇచ్చి మామిడి కొనాలని పల్ఫ్ కంపెనీలను కోరామని మంత్రి అచ్చెన్న తెలిపారు. అటు చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు.
ఇవాళ చిత్తూరు జిల్లా బాంగారుపాళ్యంలో పర్యటించిన వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని విమర్శించారు. కిలో మామిడి రెండు రూపాయలా? ఇదేం దారుణం అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి 29కి కొన్నామన్నారు. కర్ణాటకలో రూ.16 ఇచ్చి కేంద్రమే కొనుగోలు చేస్తోందన్నారు.