త్వరలో రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌లో భాగంగా రెండు కమిటీలను ప్రభుత్వం నియమించింది. అపెక్స్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది. రెండు కమిటీలు చేయవలసిన సూచనలను నిర్దేశిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. అపెక్స్ కమిటీ చైర్మన్ గా మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ వి కామకోటి, మెంబర్ సెక్రటరీ గా ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, పలు దిగ్గజ ఐటి సంస్థల ప్రతినిధులు, పలు ఐఐటీ, ఐఐఎం,సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థల ప్రతినిధులు 14 మందితో కమిటీని నియమించారు.
ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ గా తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కె ఎన్ సత్యనారాయణ, మెంబర్ సెక్రటరీ గా ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సుందర్ తో పాటు పలు కీలక సంస్థల ప్రతినిధులు 13 మందితో కమిటీని నియమించారు. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు కమిటీలు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పని చేయనున్నాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ చేపట్టే కార్యక్రమాలకు ఈ రెండు కమిటీలు మార్గదర్శనం, సాంకేతిక పర్యవేక్షణ అందించనున్నాయి.