మొగల్తూరు తీరంలో.. కృష్ణంరాజు స్మృతి వనం

AP Government announced Smriti Vanam in memory of actor Krishnam Raju. ఇటీవల మరణించిన ప్రముఖ తెలుగు నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.కృష్ణంరాజు గౌరవార్థం మొగల్తూరు తీర ప్రాంతంలో

By అంజి  Published on  29 Sep 2022 3:45 PM GMT
మొగల్తూరు తీరంలో.. కృష్ణంరాజు స్మృతి వనం

ఇటీవల మరణించిన ప్రముఖ తెలుగు నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.కృష్ణంరాజు గౌరవార్థం మొగల్తూరు తీర ప్రాంతంలో స్మారక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి సీహెచ్ వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద రాజు గురువారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు చేరుకున్నారు. కృష్ణంరాజు స్మారక సభ సందర్భంగా , వారు ప్రభాస్‌తో పాటు, కృష్ణంరాజు కుటుంబంతో ముచ్చటించారు.

కృష్ణంరాజు స్వగృహంలో సంస్మరణ సభ ఏర్పాటు చేయగా, ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభాస్‌కు, కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు మంత్రులు సానుభూతి తెలిపారు. వారిని కలిసిన అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణంరాజు స్మృతి వనం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం రెండెకరాల భూమిని మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కృష్ణంరాజు సినీ, రాజకీయ రంగాల్లో రాణించారని, ఆయన మరణం ప్రతి ఒక్కరికీ తీరని లోటని మంత్రి రోజా కొనియాడారు. ప్రజలందరూ, పార్టీలు అందరూ ప్రేమించే, గౌరవించే వ్యక్తిత్వం ఆయనదని ఆమె అన్నారు.

కృష్ణంరాజు సంస్మరణ సభ ఈరోజు ఆయన స్వగ్రామం మొగల్తూరులో జరగగా ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 12 ఏళ్ల తర్వాత మొగల్తూరులో అడుగు పెట్టడంతో ప్రభాస్‌కు స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. ప్రభాస్‌ను చూసేందుకు, వారి హీరో కృష్ణంరాజుకు అంతిమ నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కుటుంబ సభ్యులు హాజరైన వారికి గొప్ప విందును కూడా ఏర్పాటు చేశారు.


Next Story