AP: 108 అడుగుల రాముడి విగ్రహానికి శంకుస్థాపన

కర్నూలు జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహానికి కేంద్రమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు.

By అంజి  Published on  24 July 2023 6:57 AM IST
Andhra Pradesh, Lord Rama, statue, AmitShah

AP: 108 అడుగుల రాముడి విగ్రహానికి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో 108 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. తన కార్యాలయం నుంచే వీడియో లింక్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ. 300 కోట్ల వ్యయంతో జై శ్రీరామ్ ఫౌండేషన్ 'పంచలోహ' విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం.. విగ్రహం కోసం 10 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చింది, ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన దేవత విగ్రహం అవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఈ విగ్రహంతో మంత్రాలయం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుతోందన్నారు. ఈ విగ్రహం అనేక యుగాలుగా యావత్ ప్రపంచానికి సనాతన ధర్మ సందేశాన్ని అందిస్తుందన్నారు.

ఈ విగ్రహ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలో, ప్రపంచంలో వైష్ణవ సంప్రదాయాన్ని బలోపేతం చేస్తుందన్నారు. "భారతదేశంలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి భారీ విగ్రహం, నగరాన్ని భక్తి భావంతో ముంచెత్తుతుంది, అదే సమయంలో మన గొప్ప, శాశ్వతమైన నాగరికత విలువల పట్ల వారి నిబద్ధతలో స్థిరంగా ఉండటానికి ప్రజలను ప్రేరేపిస్తుంది" అని అమిత్‌ షా ట్వీట్ చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అధిపతి సుబుధేంద్ర తీర్థ, జై శ్రీరామ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాములు, శ్రీధర్, రాష్ట్ర మంత్రి జి. జయరామ్, బిజెపి నాయకుడు టిజి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రాలయంలో శ్రీరాముడి విగ్రహ నిర్మాణంలో.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణకర్త, ప్రముఖ శిల్పి రామ్ వాంజీ సుతార్ పాలు పంచుకోనున్నారు. కాగా ఈ విగ్రహం ముందు భాగంలో రామాలయం ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించారు.

Next Story