పార్టీకి రాజీనామా తర్వాత తొలిసారి జీవీ రెడ్డి ట్వీట్..ఏపీ బడ్జెట్‌పై ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ టీడీపీ నేత జీవీ రెడ్డి స్పందించారు.

By Knakam Karthik  Published on  1 March 2025 11:34 AM IST
AndraPradesh, GV Reddy, AP Budget, CM Chandrababu

పార్టీకి రాజీనామా తర్వాత తొలిసారి జీవీ రెడ్డి ట్వీట్..ఏపీ బడ్జెట్‌పై ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ టీడీపీ నేత జీవీ రెడ్డి స్పందించారు. వార్షిక బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు. కేవలం రూ.33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ.3 లక్షల 22 వేల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రణాళికబద్ధంగా రూపొందించారని కొనియాడారు. తాను రాజకీయాలకు దూరంగా ఉప్పప్పటికీ సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందన్నారు. ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లోనూ చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నారు. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత అని జీవీ రెడ్డి చెప్పారు.

తక్కువ కాలంలోనే టీడీపీలోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ తనకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ చంద్రబాబుకు రుణపడి ఉంటానన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. కాగా, ఇటీవల ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ ఎండీ దినేష్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. అలాగే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

Next Story