ఆ కేసులో తీర్పు రిజర్వ్
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై
By Medi Samrat Published on 5 Oct 2023 1:14 PM GMTఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఎదుట వాదనలు కొనసాగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు చంద్రబాబును ఎలా బాధ్యుడ్ని చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుపై రాజకీయ కక్షతో ఈ కేసు నమోదు చేశారని.. రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేదని లూథ్రా, అగర్వాల్ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో అక్టోబర్ 19 వరకు చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను పొడిగించింది ఏసీబీ కోర్టు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. రెండోసారి విధించిన రిమాండ్ గడువు ముగియడంతో మరోసారి అక్టోబర్ 19 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జైలు అధికారులు చంద్రబాబుని వర్చువల్‌గా ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌ను రెండువారాల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.