పరీక్షలు రద్దు చేయాలని ఏపీకి సుప్రీం నోటీసులు వచ్చాయా..?
AP Exams 2021. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టెన్త్, ఇంటర్ సెకండ్ పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ
By Medi Samrat Published on 17 Jun 2021 2:25 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టెన్త్, ఇంటర్ సెకండ్ పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెబుతూనే వస్తున్నారు. ఇక జులై నెలలో పది, ఇంటరు పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని ఆదిమూలపు సురేష్ తాజాగా వెల్లడించారు. కరోనా కేసులు తగ్గుతుండడంతో జులైలో పది, ఇంటరు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని.. జులై మొదటి వారంలో ఇంటరు, చివరి వారంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాల కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని.. కరోనా లేకపోతే పరీక్షలకు ఇబ్బందులు ఉండవని అన్నారు. జులైలో పరీక్షలు నిర్వహించలేకపోతే ఇక అవకాశం ఉండదని భావిస్తున్నామని ఆదిమూలపు సురేష్ చెప్పుకొచ్చారు. పరీక్షలు రద్దు చేయడం అనేది తమకు ఎంతో సులభమైన పని అని, ఒక్క నిమిషంలో రద్దు చేయగలమని తెలిపారు. కానీ తర్వాత పర్యవసానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని పరీక్షలు జరుపుతామని తెలిపారు.
ఈరోజు సుప్రీం కోర్టులో రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై విచారణ కొనసాగింది. పరీక్షలను ఇప్పటి వరకు రద్దు చేయని రాష్ట్రాలుగా పంజాబ్, అస్సాం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. 12వ తరగతి పరీక్షలను 28 రాష్ట్రాల్లో, 18 రాష్ట్రాలు రద్దు చేశాయి. 6 రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయని న్యాయస్థానం తెలిపింది. 4 రాష్ట్రాలు రద్దు చేయలేదని.. ఆ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నోటీసులు అందినట్లు తెలుస్తోంది.
ఈరోజు విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ సుప్రీం నోటీసులపై మాట్లాడారు. సుప్రీం కోర్టు నోటీసుల విషయం తమ దృష్టికి రాలేదని.. వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సుప్రీం కోర్టు నుండి ఒక వేళ నోటీసులు వస్తే తమ వైఖరి వినిపిస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు.