ఆయన ష్యూరిటీ మాత్రమే ఇస్తాడు, గ్యారెంటీ ఉండదు..చంద్రబాబుపై జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 6 Feb 2025 1:29 PM IST
ఆయన ష్యూరిటీ మాత్రమే ఇస్తాడు, గ్యారెంటీ ఉండదు..చంద్రబాబుపై జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయలో మీడియాతో మాట్లాడిన ఆయన..కూటమి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, సీఎం అయ్యాక ఏ హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేకపోయారని అన్నారు. ఎన్నికల్లో బాబు ష్యూరిటీ మాత్రం ఇస్తాడు కానీ.. గెలిచాక పథకాల అమలుకు గ్యారెంటీ ఉండదని సెటైర్ వేశారు.
ఎన్నికల్లో మీరు చెప్పిన హామీలను నెరవేర్చలేమని అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే చేతులెత్తేశారని.. ఇప్పుడు చెప్పండి చంద్రబాబు, లోకేశ్.. జనం వచ్చి ఎవరి చొక్కా కాలర్ పట్టుకుని నిలదీయాలని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 9 నెలలైంది ఉద్యోగులకు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? అని హామీ ఇచ్చిన ఒక్క పథకమూ ఇవ్వలేదని.. రాష్ట్రం అప్పులు మాత్రం కొండల్లా పెరిగిపోయాయని ఆరోపించారు. ఈ డబ్బంతా ఏమైయిపోందని.. ఎక్కడికి వెళ్తుందో, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడని జగన్ ఆరోపించారు. జీఎస్‌డీపీ పెరిగితే రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గిందని జగన్ ప్రశ్నించారు. జూన్-డిసెంబర్ మధ్య రాష్ట్ర ఆదాయం రూ.50,544 కోట్లు. ఈ నెలల్లో 0.51 శాతం నెగెటివ్ గ్రోత్ వచ్చింది. చంద్రబాబు మాత్రం 13 శాతం జీఎస్డీపీ ఉందంటూ తప్పుడు నివేదిక ఇచ్చారని మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో చంద్రబాబు సాధించింది ఏమీ లేదని, ఆయన పలుకుబడి ఏంటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.