కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రు జిల్లా పరిషత్ పాఠశాలలో ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకోవడం కలకలం రేపింది. పరీక్ష కేంద్రానికి ఆన్సర్ స్లిప్ పంపుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. సమాచారం అందుకున్న వెంటనే విద్యాశాఖ, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పలువురు ఉపాధ్యాయుల సెల్ ఫోన్లలో పరీక్ష పేపర్లకు సంబంధించిన సమాధానాలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. డీఈవో తాహిరా సుల్తానా పసుమర్రు చేరుకుని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఘటనపై విచారణ జరుగుతుండగా మీడియాకు వివరాలు చెప్పేందుకు అధికారులు నిరాకరించారు.
కాగా, చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పూతలపట్టు మండలం పోలవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ హరి నారాయణన్ తనిఖీ చేశారు. మరో ఘటనలో అనంతపురంలోని పెనుకొండలోని ఓ సైన్స్ స్కూల్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థినిపై సీలింగ్ ఫ్యాన్ పడింది. బాలిక కంటి కింది భాగంలో గాయమై రక్తస్రావం అయింది. వెంటనే వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. విద్యార్థికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థి ప్రథమ చికిత్స అనంతరం పరీక్ష పూర్తి చేశాడు.