AP: ప్రభుత్వాస్పత్రిలో కరెంట్‌ కోత.. సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుతురులో చికిత్స

ఏపీ: కురుపాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రమాద బాధితుడికి మొబైల్ ఫోన్ టార్చ్ ఉపయోగించి వైద్యులు చికిత్స చేస్తున్న వీడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది.

By అంజి  Published on  3 Sept 2023 11:25 AM IST
APnews, Doctors, Phone torch, treatment, Kurupam Primary Health Centre

AP: ప్రభుత్వాస్పత్రిలో కరెంట్‌ కోత.. సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుతురులో చికిత్స

ఆంధ్రప్రదేశ్‌: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని కురుపాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రమాద బాధితుడికి మొబైల్ ఫోన్ టార్చ్ ఉపయోగించి వైద్యులు చికిత్స చేస్తున్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రమాదంలో గాయపడిన ఇద్దరు బాధితులను చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. గుమ్మలక్ష్మీపురం మండల పరిధిలోని గోయిపాక గ్రామ సమీపంలో ఆటో రిక్షా బ్రేకులు ఫెయిల్‌ కావడంతో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది గాయపడగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108లో హుటాహుటిన కురుపాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రాత్రి వైద్యురాలు గాయానికి కుట్లు వేస్తుండగా లోడ్ షెడ్డింగ్ కారణంగా కరెంటు పోయింది. ఒక నర్సు తన మొబైల్ ఫోన్ టార్చ్‌ని ఉపయోగించింది. తద్వారా వైద్యురాలు బాధితుడి గాయానికి కుట్టు వేయడం కొనసాగించింది. కరెంట్‌ కోతల వల్ల సెల్ టార్చ్ లైట్ వెలుతురులో పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కేవలం రెండు నిమిషాలు మాత్రమే కరెంటు పోయిందని, ఒక సిబ్బంది జనరేటర్ స్విచ్ ఆన్ చేయడానికి వెళ్లగా, డాక్టర్ మొబైల్ ఫోన్ లైట్ సాయంతో తన ప్రక్రియను కొనసాగించారని పార్వతీపురం హెడ్ క్వార్టర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి తెలిపారు.

Next Story