రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.
By - Knakam Karthik |
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10గం.30ని. నుంచి 11 గం.30ని. మధ్య ఈ కార్యక్రమాలు ఉంటాయి. కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు దృష్టికి వచ్చాయి.
దీక్ష విరమణ మండపం విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు, అర్చకులు కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టి.టి.డి. సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఈ విషయమై టి.టి.డి. ఛైర్మన్ బి.ఆర్.నాయుడుతో చర్చించారు. టి.టి.డి. బోర్డు రూ.35.19 కోట్లు మంజూరుకు అంగీకారం తెలిపింది.
ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు మెంబర్లు బి.ఆనందసాయి, బి.మహేందర్ రెడ్డి , టీటీడీ ఎల్.ఎ.సి.ఛైర్మన్ ఎన్ శంకర్ గౌడ్ , ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొననున్నారు.