ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. జూర్ 29వ తేదీన పవన్ కల్యాణ్ కొండగట్టుకు రానున్నారు. శనివారం ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. 11 రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో భాగంగా ఆయన కేవలం పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకోనున్నారు. వారాహి దీక్షలో భాగంగానే పవన్ కల్యాణ్ తన ఇంటి ఇలవేల్పు అయిన కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కొండగట్టుకు రావడం ఇదే మొదటిసారి. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ముందు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చారు. తన ఎన్నికల ప్రచార రథమైన వారాహికి పూజలు కూడా కొండగట్టులోనే జరిగాయి. అనంతరం పవన్ తన వారాహి వాహనంపై ప్రచార యాత్రను కొనసాగించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ భేరి మోగించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంలో పవన్ కీ రోల్ ప్లే చేశారు.
కాగా కొండగట్టు అంజనేయుడి దర్శనం అనంతరం పవన్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంకు వెళ్లనున్నారు. వచ్చె నెల 1 న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. అదే రోజు సాయంత్రం వారాహి సభను నిర్వహించి.. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు.