అమరావతి: రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో ఇవాళ ఉద్దండరాయునిపాలెంలో 2015లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమై షర్మిలను విజయవాడలోని తన ఇంట్లో గృహ నిర్బంధం చేశారు. తనను ఎందుకు హౌజ్ అరెస్ట్ చేశారు? ఆ కారణమేంటో రాష్ట్ర ప్రజలకు చెప్పాలంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
''ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు.. విజయవాడలోని నా విల్లాలో నన్ను ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచారు? ఏ కారణం చేత? దయచేసి ఏపీ ప్రజలకు చెప్పండి. నా పని ప్రదేశానికి వెళ్లడం ఇప్పుడు నేరమా?. మీరు మా రాజ్యాంగ హక్కులను ఎందుకు కాలరాయడానికి ప్రయత్నిస్తున్నారు? మీ ప్రభుత్వం దేనికి భయపడుతోంది?'' అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
అటు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. వర్షం వస్తే పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రొటోకాల్ ప్రకారం.. అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నట్టు వివరించారు. ప్రధాని మోదీ మే 2వ తేదీన అమరావతిలో పర్యటించి రాజధాని పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన చేసి, భారీ బహిరంగ సభలో మాట్లాడనున్న విషయం తెలిసిందే.