రాష్ట్ర సమస్యలపై అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ
AP CM YS Jagan meets Union Home Minister Amit Shah. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ
By అంజి Published on 29 Dec 2022 9:46 AM GMTకేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం జగన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఫ్రీగా ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం రెడీగా ఉందని హోంమంత్రికి సీఎం తెలిపారు.
రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలు పరిష్కారం కాలేదని అమిత్‌షాకు సీఎం జగన్ వివరించారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగా హోం మంత్రిని కోరారు. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్న విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
బుధవారం ఆయన ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బకాయిలు, నిధులు సహా పలు అంశాలపై సీఎం జగన్ ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధితో పాటు రాజకీయ అంశాలపైనా చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో ప్రధానంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులతో పాటు ఏపీకి రావాల్సిన నిధులపై మోదీకి వివరించారు.